Sunday, August 25

ఆ యాప్స్ తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ !

థర్డ్ పార్టీ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల కాలంలో చాలా యాప్స్ అందుబాటులోకి రావడంతో బ్యాంకు ఖాతాల్లోని నగదును ఒక ఖాతా నుంచి మరో చోటికి బదిలీ చేయడం జనానికి ఈజీ అయింది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా సొంతంగా యాప్స్ ను అందుబాటులోకి తెచ్చాయి. అయితే కొన్ని యాప్స్ క్యాష్ బ్యాక్స్, రివార్డు పాయింట్లు ఇస్తామని ప్రకటిస్తుండటంతో చాలామంది ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. పైగా వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని తమ మిత్రులు, బంధువులకు ఇన్విటేషన్స్ కూడా పంపుతున్నారు. కస్టమర్లను ఆకట్టుకోడానికి కొన్ని యాప్స్ అయితే మీ అకౌంట్ లో ఫలానా వ్యక్తి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశారు... ఈ లింక్ తో యాప్ డౌన్లోడ్ చేసుకొని... వెయ్యి రూపాయల గిఫ్ట్ పొందండి అంటూ ఊరిస్తున్నాయి.

జాగ్రత్త... ఇలాంటి యాప్స్ తోనే మోసగాళ్ళు మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులను దోచేస్తారు. థర్డ్ పార్టీ యాప్ లను అస్సలు నమ్మొద్దంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ యాప్స్ బ్యాంక్, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఖాతాల్లో డబ్బులు ఖాళీ చేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన నారాయణ్ హెగ్దే అనే సిండికేట్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ తో రూ.1.24లక్షలు పోగొట్టుకున్నారు. ఈయన ఎనీ డెస్క్ (AnyDesk) అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇన్ స్టాల్ పూర్తయ్యాక మీకు వచ్చిన మెస్సేజ్ ను ఫార్వార్డ్ చేయండి అని రావడంతో ఆయన పంపారు. వెంటనే అతని ఖాతా నుంచి దశల వారీగా డబ్బులు విత్ డ్రా అవుతూ వచ్చాయి. వెంటనే తన బ్యాంక్ కు సమాచారం ఇవ్వడా... UPI ద్వారా ఆదిత్యా బిర్లా పేమెంట్స్ బ్యాంకుకు ఐదు లావాదేవీల ద్వారా రూ.1.24లక్షలు జమ అయినట్టు బయటపడింది. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది. మోసగాళ్ళు కొత్త కొత్త విధానాలతో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు దొంగిలిస్తున్నారనీ... జాగ్రత్తగా ఉండాలని సూచించింది. AnyDesk లాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని బ్యాంక్స్ ఖాతాదారులను హెచ్చరించింది. డౌన్లోడ్ చేసుకునే టైమ్ లో 9 అంకెల కోడ్ ను షేర్ చేయాలని అడుగుతారనీ... అలా చేస్తే వెంటనే మీ ఖాతాల్లో నుంచి డబ్బులు మాయం అవుతాయని ఆర్బీఐ చెబుతోంది.

ఖాతా సంబంధిత లావాదేవీల విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అనేక సూచనలు చేస్తోంది. ఖాతా భద్రత విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలను సూచిస్తోంది. అలాగే ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు కూడా తమ ఖాతాదారులను అలెర్ట్ చేయాల్సిన అవసరముంది. ఇతరులెవరికీ తమ OTP లేదా PIN నెంబర్ ఇవ్వడం లేదా మొబైల్ ను యాక్సెస్ చేసేందుకు అనుమతి ఇవ్వడం లాంటి చేయొద్దని NPCI అధికారులు హెచ్చరిస్తున్నారు. UPI ప్లాట్ ఫామ్ మాత్రం రెండు అంచెల భద్రత కల్పిస్తున్నట్టు చెబుతున్నారు.

థర్డ్ పార్టీ యాప్స్ తో జాగ్రత్త
బ్యాంకులు, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కాకుండా ఇతరులు పెట్టే థర్డ్ పార్టీ యాప్స్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. యాపిల్, గూగుల్ ప్లే స్టోర్ లో ఇలాంటి యాప్స్ చాలానే ఉన్నాయి. వీటిని ఇన్ స్టాల్ చేసుకునేటప్పుడు... మొబైల్ లో వివిధ అనుమతులను కోరతాయి. వీటిల్లో ఏవైనా యాప్స్ బ్యాంక్ ఖాతాల వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు అడుగుతున్నాయంటే... అలాంటి యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఇన్ స్టాల్ చేయకపోవడమే బెటర్.

ఇంకో మాట
మీ మొబైల్ ఎప్పుడో... ఏదో అవసరం కోసం చాలా యాప్స్ ఇన్ స్టాల్ చేసి ఉంటారు. వాటిల్లో మీరు వాడనివి చాలా ఉండొచ్చు. వాటిని అన్ ఇన్ స్టాల్ చేయడమే బెటర్.