ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ఎలా చదవాలి ?

ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ఎలా చదవాలి ?

ముందుగా నేను అడగబోయే ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు మీ దగ్గరున్న తెల్లకాగితం మీద నోట్ చేసుకోండి...

 • మీరు ఈ మూడు రోజుల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి సంబంధించి చదివిన ప్రశ్నల్లో ఎన్ని గుర్తున్నాయి ?
 • మీరు ఈ మూడు రోజుల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఎన్ని మెస్సేజ్ లు ఫార్వార్డ్ చేశారు ?
 • మీకు నిజంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఉందా ?

ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు రాసుకున్నారు కదా... ఏమని జవాబులు రాసి ఉంటారు?

 • 10 ప్రశ్నలు
 • 30-40 మెస్సేజ్ లు
 • ఉంది

ఒకే... మీరు నిజాయితీగా పరీక్ష చేసుకుంటే... పైన ఇచ్చిన 3 ప్రశ్నలకు దగ్గర దగ్గర గా అవే సమాధానాలు ఉంటాయి. ఎందుకంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని బలంగా ఉంది... అయినా సరే... మీకు ఈ కింది సందర్భాల్లో ప్రస్టేషన్ వస్తూ ఉంది....

 1. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడటం లేదు
 2. పడినా 1800 లేదా 2 వేలకు మించడం లేదు
 3. నిన్న వాట్సాప్ లేదా ఫేస్ బుక్ లో ఆ ఉద్యోగాలు అమ్ముడు పోయాయని న్యూస్ వచ్చింది..
 4. చదువుదామంటే మెటీరియల్ లేదు
 5. చదివినా గుర్తుండటం లేదు
 6. రేపటి నుంచి ఖచ్చితంగా చదవాలి... ఎలాగైన ఎగ్జామ్ కొట్టాలి....

ఇలాంటి ఆలోచనలు మీలో చాలామందికి వచ్చి ఉండొచ్చు.  మనం సరిగ్గా ఇక్కడే ఓడిపోతున్నాం. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ మీ మదిలోకి రానీయొద్దు. పైన మీకు వచ్చిన ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెబుతా చూడండి.

 1. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు... వస్తూనే ఉన్నాయి. కొన్ని వ్యవస్థాపరమైన లోపాలు ఉండొచ్చు. అంతమాత్రానా సర్కార్ జాబ్స్ ఫిల్ చేయకుండా ఉండదు.  వచ్చే ఏడాది లోపు ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయడం ఖాయం.
 2. ఉద్యోగాలు ఎన్ని పడితే మీకెందుకు... మీ జోన్ లో లేదా మీ జిల్లాలో ఒక్క పోస్ట్ మీకు కావాలి. అంతేగానీ సంఖ్యతో పనిలేదు
 3. వాట్సాప్, ఫేస్ బుక్ లో రోజూ ఇలాంటివే వస్తుంటాయి... అవన్నీ తలకి ఎక్కించుకుంటే మనం మన గమ్యం వైపు అడుగులు వేయలేం.... పైగా ఇలాంటి కనీసం మనమైనా ఫార్వార్డ్ చేయకుండా ఉంటే బెటర్.  అమ్ముకోవడం అనేది జరిగితే ఎప్పటికైనా బయటకు వస్తుంది.  న్యాయం కోసం కోర్టులూ ఉన్నాయి.  మనం వీటి గురించి ఆలోచించడం అనవసరం... నువ్ ఎగ్జామ్ లో  వందకు 90 మార్కులు తెచ్చుకుంటే... నిన్ను కాదని... పరపతో, పైసలో ఉన్నోడికో ఉద్యోగం ఇవ్వలేరు కదా....
 4. చదువుదామంటే మెటీరియల్ లేదు... ఇది శుద్ధ అబద్ధం.... మీరు ఇప్పుడే మీకు దగ్గర్లో ఉన్న బుక్ స్టాల్ కి వెళ్ళి... 7 టు 10 వ తరగతి టెస్ట్ పుస్తకాలు తెచ్చుకోండి... వాటినన్నింటికీ చదివేయండి... 60 టు 70% మార్కులు మీరు గెయిన్ చేసినట్టే.
 5. చదివినా గుర్తుండటం లేదు... అనేది కూడా రాంగే...
  • ముందు మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఏం ఉద్యోగం కొట్టాలి ?
  • ఆ ఎగ్జామ్ కి ఉన్న సిలబస్ ఏంటి ?
  • ఎంట్రన్స్ ఎగ్జామ్ కి మనకి ఎంత టైమ్ ఉంది ?
  • ఈ సబ్జెక్ట్ లో ఎన్ని చాప్టర్లు చదవాలి ?
  • ఏ సబ్జెక్ట్ కు ఎంత టైమ్ కేటాయించాలి ?
  • రోజువారీగా మనం ఎన్ని గంటలు చదువుతున్నాం ?
  • ఎంత సేపు రెస్ట్ అవసరం

ఇలా ప్రతిదీ ప్లానింగ్ వేసుకోండి.  చదువు మీద మీకు ఎందుకు శ్రద్ధ ఉండదు... ఇప్పటి దాకా మనం క్లాస్ పుస్తకాలు చదువుకున్నాం... మనం ఎక్కడా బోర్ ఫీలవ్వలేదు.  మరి ఇప్పుడెందుకు ఆ బోర్ ని కొని తెచ్చుకోవాలి ?

6) ఈ రేపటి నుంచి అనేది... ఒకసారి గోడ మీద రాసుకొని చూడండి... రేపు కూడా మళ్ళీ లేచి దాన్ని చూడండి... అదే ఫాలో అవ్వండి... మీరు జీవితంలో ఎప్పుడూ... ఏమీ సాధించలేరు... ఎందుకంటే ఆ రేపటి నుంచి చదువుదాం... అనేది రోజూ మీకు కనిపిస్తుంది.

అందుకే ... రేపు అనే వాయిదా వేయొద్దని ఎందరో పెద్దవాళ్ళు,  జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు చెప్పారు.  అందువల్ల ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి... రేపు అనో... వినాయకచవితి తెల్లారి... లేదంటే నాకు గురువారం ఇష్టం... ఆ రోజు నుంచి.... ఏయ్... అమావాస్య ముందు ఎలా చదువుతాం.... అని వాయిదాలు వేసుకుంటూ పోతే... మనం ఇక్కడే ఉంటాం... అవతలివాడు... రాత్రింబవళ్ళు చదవి... ఎంచక్కా ఉద్యోగం కొట్టేస్తాడు...

వాట్సాప్, ఫేస్ బుక్ తో బిజీ...

ముఖ్యంగా ఈమధ్య కాలంలో ఈ సోషల్ మీడియా వచ్చాక... ప్రతి పండగ, కార్యక్రమానికి విషెస్ చెప్పడం ఫ్యాషన్ అయింది... వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారం, పొలాల అమావాస్య దగ్గర నుంచి ప్రతిదీ మనకి ఇంపార్టెంట్ అయింది.  ఎవరో పంపిన మెస్సేజ్ ను వెనకా ముందు చూడకుండా... ఫార్వార్డ్ చేయడం.

దీనివల్ల నీకేమైనా సంతృప్తి మిగిలిందా ? నువు శుభాకాంక్షలు చెప్పలేదని ఎవరైనా ఫీలవుతారా ? లేదా చెప్పావని సంతోషపడ్డారా ?  ఏమీ లేదు.

నిజంగా నీ మిత్రులు, బంధువులకు సంతోషం ఎప్పుడు ఉంటుందో తెలుసా... నీకు జాబ్ వచ్చినప్పుడు... మీ ఊర్లో.. ఫలానా వాళ్ళ కొడుకు ఫలానా జాబ్ కొట్టాడు అని చెప్పుకుంటే... అప్పుడే నీకు నిజమైన సంతోషం ఉంటుంది.

ముందు ఫార్వార్డ్ చేయడం మానండి... ఎవరు ఏ పథకాలను లేదా ఏ వెబ్ సైట్ లోది పీడీఎఫ్ తీసి పంపుతారా అని ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేసుకోకండి... అందులో తప్పులు ఉండొచ్చు... మీరు అనుకున్నది రాకపోవచ్చు... ముందు మీ దగ్గర స్టాండర్డ్ మెటీరియల్ ఉంటే చాలు... మీరు చదివిన పుస్తకాల నుంచే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వొచ్చు.

నేను వాట్సాప్ గ్రూపుల్లో చాలాసార్లు విజ్ఞప్తి చేశాను.  అయినా ఇంకా చాలామంది మారడం లేదు. అలాంటి వాళ్ళకి నిజంగా జీవితంలో గమ్యం ఏదీ లేదనే అనుకోవాలి.  మీరు ఇలాగే... వచ్చిన పోస్టునల్లా ఫార్వార్డ్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తే.... మీరు చదవాల్సి చదువు వెనుకబడి పోతుంది.  మీరు జాబ్ లేదా గమ్యం చేరలేక.... ప్రభుత్వాలనో, వ్యవస్థో తిట్టుకుంటూ ఉండి పోతారు.

ఈమధ్య చాలామంది ఎవరికో ఏదో బాగో లేదనీ... లేకపోతే ఫలానా అమ్మాయి ఏదో వ్యాధితో బాధపడుతుంది... మనం ఫార్వార్డ్ చేస్తే ... వాట్సాప్ వాళ్ళు పైసలిస్తారనీ... లేకపోతే ఈ మెస్సేజ్ ఫార్వార్డ్ చేయకపోతే... మీకు శాపం తగులుతుందనీ...ఇలాంటి వస్తున్నయ్.

మనం చదువుకున్న వాళ్ళమని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి... ఇలాంటి ఆలోచనలేని మెస్సేజ్ లు పెట్టి మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.

          మీ టైమ్ ఎలా సద్వీనియోగం చేసుకోవాలి... ఏ ఎగ్జామ్ కి ఎలా ప్లానింగ్ వేసుకోవాలో... మరో ఆర్టికల్ లో చెబుతా...

-- మేడుకొండూరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్