అన్నికేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకీ ఒకే ఎగ్జామ్

అన్నికేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకీ ఒకే ఎగ్జామ్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశానికి ప్రస్తుతం అనేక రకాల ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సి వస్తోంది. దాంతో నిరుద్యోగ అభ్యర్థులు ఆయా ఎగ్జామ్స్ కి వేర్వేరుగా ప్రిపేర్ అవడం, ఎగ్జామ్స్ ఫీజులు కూడా విడివిడిగా చెల్లించాల్సి రావడం పైగా ఎగ్జామ్స్ కేంద్రాలకు ఛార్జీలు, ఇతర ఖర్చులు లాంటి భారం పడుతోంది. అందుకే వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ (NRA) ను తీసుకొస్తోంది. బ్యాంకింగ్ (IBPS), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ ( RRB) లాంటి ఎగ్జామ్స్ అన్నింటికీ ఇకపై కామన్ ఎంట్రన్స్ ను నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏజెన్సీకి కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదం తెలిపింది.

నాన్ టెక్నికల్ గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులన్నింటినీ NRA ద్వారానే భర్తీ చేస్తారు. ఈ NRA లో రైల్వేశాఖ, ఆర్థిక శాఖ ప్రతినిధులతో పాటు రిక్రూట్ మెంట్ బోర్డులైన SSC, RRB, IBPS కు చెందిన రిప్రజెంటిటేటివ్స్ కూడా సభ్యులుగా ఉంటారు.
అభ్యర్థులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ స్టాండర్డ్స్ లో CET ని నిర్హహిస్తారు. అభ్యర్థికి తనకు ఉన్న క్వాలిఫికేషన్ ను బట్టి ఆయా సెట్స్ రాయాల్సి ఉంటుంది. అందుకోం 3 లెవల్స్ లో సెట్స్ ను NRA నిర్వహిస్తుంది. అభ్యర్థులు ఫైనల్ మార్కుల ఆధారంగా వివిధ రిక్రూట్ మెంట్ బోర్డులు అర్హతను బట్టి మళ్ళీ టయర్ 2, టయర్ 3 స్పెషలైజ్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తాయి. కొన్ని సంస్థలు మొదటి టెస్టుతోనే అభ్యర్థులను భర్తీ చేస్తామని ప్రకటించాయి.

ఒక్కసారి రాస్తే 3 యేళ్ళ దాకా చెల్లుబాటు

అభ్యర్థి ఒక్కసారి NRA నిర్వహించే CET రాస్తే... 3 యేళ్ళ పాటు ఆ స్కోర్ ను లెక్కలోకి తీసుకుంటారు. అంతేకాదు అభ్యర్థి వయో పరిమితి అయిపోయే లోపు ఎన్నిసార్లయినా CET రాసుకోడానికి అనుమతి ఉంటుంది. ఇన్ని సార్లు మాత్రమే రాయాలన్న నిబంధన ఏదీ ఉండదు. ఇక వయో పరిమితి సడలింపు కలిగిన SC/ST/OBC/దివ్యాంగులు ఇతర కేటగిరీలో AGE RELAXATION కూడా వర్తిస్తుంది.

నచ్చిన భాషలో ఎగ్జామ్

అభ్యర్థులు CET ని తమకు నచ్చిన భాషలో రాసుకోవచ్చు. ప్రస్తతుం 12 భాషల్లో మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో ఉన్న అన్ని భారతీయ భాషల్లోనూ ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. దీంతో అభ్యర్థులకు ఖర్చు తగ్గుతుంది. మాతృభాషలో మంచి ప్రావీణ్యంతో ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది.

NRA కిందకు మొత్తం 20 నియామక సంస్థలను తీసుకొస్తున్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున దాదాపు 1000 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఏటా రెండుసార్లు ఈ CET ను నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒకసారి రాసిన ఎగ్జామ్ స్కోర్ మూడేళ్ళ దాకా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తే మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాసుకునే ఛాన్స్ ఉంది.

ఇది కూడా చదవండి CET కి దేశమంతటికీ ఒకే సిలబస్