అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు
అగ్రవర్ణాలు (ఓసీలు) ల్లో పేదలకు కూడా రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. దీనికి సంబంధించి మంగళవారం పార్లమెంటులో బిల్లు పెట్టాలని ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి 8 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న అగ్రవర్ణాల్లోని పేదలకు ఈ 10శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో రిజర్వేషన్ల కోటా 50 నుంచి 60శాతానికి చేరే అవకాశం ఉంది.
రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్ కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదం కోసమే శీతాకాల సమావేశాలను మరో 2 రోజుల పాటు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.