ప్రధాని మోడీ ఫారెన్ టూర్స్ ఖర్చెంతో తెలుసా ?

ప్రధాని నరేంద్రమోడీ నాలుగున్నరేళ్ళ కాలంలో విదేశీ టూర్లకి, ప్రభుత్వ పథకాల ప్రచారానికి పెట్టిన ఖర్చులు చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. ఈ రెండు కార్యక్రమాలకు మోడీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 920 మిలియన్ డాలర్లు... అంటే దాదాపు 7వేల కోట్ల రూపాయలు... ఇంకా వివరంగా చెప్పాలంటే

రూ. 6,620,32,00,000.00

ప్రధాని నరేంద్రమోడీ 2014 నుంచి 2018వరకూ మొత్తం 84 విదేశీ ట్రిప్పులకు వెళ్ళారు. అందుకోసం భారత ప్రభుత్వం రూ.2వేల15 కోట్లు ఖర్చుపెట్టింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వ విజయాలను దేశమంతా ప్రచారం చేయడానికి రూ.4వేల604 కోట్లు ఖర్చయ్యాయి.

ఇక ప్రతి విదేశీ ప్రయాణానికి ఎయిర్ ఇండియా వన్ విమానం, అందులో సెక్యూర్ హాట్ లైన్ సెటప్ చేసేవారు. ఇవి ప్రతిపక్షాలు ఆరోపించినవి కావు. పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రులు వీకే సింగ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పిన సమాధానాలు ఇవి.

ప్రధాని నరేంద్రమోడీ పదవిని చేపట్టిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేతో చాలాసార్లు సమావేశం అయ్యారు. అలాగే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఉహాన్ సిటీలో సమావేశం అయ్యారు. ఇవన్నీ కూడా భారత్ తో ఆయా దేశాల సత్సంబంధాలు మెరుగుపరుచుకోడానికే అంటున్నాయి బీజేపీ వర్గాలు. అలాగే చైనా అధ్యక్షుడితో సమావేశం తర్వాత రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని వివరిస్తున్నారు.

అయితే మోడీ టూర్స్ ని విమర్శించేవాళ్ళూ ఉన్నారు. 2016లో దేశంలో 86శాతం నోట్లను రద్దుచేశారు ప్రధాని. ఆ వెంటనే ఆయన జపాన్ కి వెళ్ళిపోయారు. దేశంలో తమ సొంత డబ్బులు తీసుకోడానికి సామాన్య జనం బ్యాంకుల ముందు క్యూ కట్టి నానా అగచాట్లు పడుతున్న టైమ్ లో... కోట్ల రూపాయల ఇండియన్ కరెన్సీతో మోడీ జపాన్ ఎలా వెళ్తారని ప్రశ్నించారు.
అలాగే ఆఫ్రికా టూర్ లో భాగంగా రువాండా ప్రజలకు 200 ఆవులను ఆయన బహుమతిగా ఇచ్చారు. ఆవు, ఎద్దు మాంసం తినే ఆఫ్రికన్ ప్రజలకు వాటిని ఎందుకు గిఫ్ట్ ఇచ్చారని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.